Significance of Maha Shivaratri: మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.
మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.

మహా శివరాత్రి ప్రాముఖ్యత | Significance of Maha Shivaratri:
మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి(Shivaratri) పర్వదినం. హిందూ పండుగల్లో ముఖ్యమైంది శివరాత్రి. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి కాగా మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి. మాస శివరాత్రి దినాల్లోనూ శివునికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత విశిష్టమైంది, ఆరాధనీయమైంది. మహాశివుడు సాకారమైన మూర్తిగానూ, నిరాకారమైన లింగంగానూ పూజలు అందుకుంటాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏటా హిమాచల్ ప్రదేశ్, మండిలో వారం రోజులపాటు ”International Mandi Shivratri Fair” నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారు.
పర్వదినం, పుణ్యదినం అయిన శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి. కోరికలు సఫలమౌతాయి. పెళ్ళి కానివారికి పెళ్ళి అవుతుంది. తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సద్గతులు లభిస్తాయి. మహాశివరాత్రి రోజున ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన ”నమశ్శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇతర రోజుల్లో గుడికి వెళ్ళలేకపోయినా ఈ విశేష దినాన తప్పనిసరిగా వెళ్తారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసి ఉంటాయి. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.
భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. పూజలు, ప్రార్థనలు, అర్చనలు, అభిషేకాలతో ఆరాధిస్తారు. శివ స్తోత్రాలు, భక్తి గీతాలతో మహేశ్వరుని ప్రార్ధిస్తారు. రోజంతా పరమేశ్వరుని చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
మహాశివునికి, విభూతికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే శివభక్తులు పరమ పవిత్రమైన విభూతిని ధరిస్తారు. శివరాత్రి రోజున విభూతిని తయారుచేస్తారు. భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే “భక్తవశంకర” అన్నారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.
దక్షిణ భారతదేశంలో మహాశివరాత్రి
మహా శివరాత్రి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు అన్ని దేవాలయాలు విస్తృతంగా జరుపుకుంటారు. శివ (మొదటి) ఆది గురువుగా భావిస్తారు. శివుడు నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది. సంప్రదాయం ప్రకారం, మానవ వ్యవస్థలో శక్తి సహజంగా, సైద్ధాంతికంగా ఉంది, ఆ శక్తి పెంపొందేందుకు ఈ రాత్రి శక్తివంతమైన గ్రహ స్థానాలు అటువంటివి ఉన్నాయి. రాత్రి అంతా తెలుసుకుంటూ (జాగరూకత), మెలుకువగా ఉన్న ఒక వ్యక్తి, శారీరక ప్రయోజనకరంగా, ఆధ్యాత్మికంగా క్షేమాన్నిపొందుతాడు అని చెబుతారు. ఈ రోజు, అటువంటి శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి వివిధ రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు.

మహాశివరాత్రి వ్రత కథ
ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి “శివ శివ” యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక “వ్యాధుడా! నన్ను చంపకుము” అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక “నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను” అని అతన్ని వొప్పించి వెళ్ళెను.
రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో “ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును” అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని “నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. “ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును.” అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము.”
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో “మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది” అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
జాగరణము
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున ఉపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్ ఓం నమః శివాయః
రుద్రాభిషేకం
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.
పంచాక్షరి మంత్రం
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు “న” “మ” “శి” “వా” “య” (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
మహామృత్యుంజయ మంత్రం
మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే “త్రయంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
శివసహస్రనామస్తోత్రం
శివసహస్రనామ స్తోత్రములోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి.
Source: Wikipedia
Pingback: 100+ Sankranti Wishes 2025 to Send to Your Loved Ones Varthapedia.com