కొత్త సంవత్సరం మొదలవుతోంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఉత్సాహం, అన్నీ కొత్త కొత్తగా ఆనందోత్సాహాలు పరవళ్ళు తొక్కుతూ వుంటాయి. ఈమాటు ఇంకో విశేషమేమిటంటే నూతన సంవత్సరం మొదటిరోజే యువతలోనేకాక భక్తులకీ, దైవానురక్తులకీ శుభోదయం పలుకుతూ ముక్కోటి ఏకాదశి కూడా వచ్చింది. ఈ శుభ సందర్భంగా మరి మనం ముక్కోటి ఏకాదశి విశేషాలను తెలుసుకుని అలాగే చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామి ఆలయాన్ని దర్శించి వద్దామా?
ముక్కోటి ఏకాదశి – Mukkoti Ekadashi
శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం
దశావతారాలలో మొదటిదైన మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడుకదా. ఆ అవతారంలోనే స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. స్ధల పురాణం ప్రకారం…
చరిత్రచరిత్ర ప్రకారం పల్లవులచే నిర్మింపబడిన ఈ ఆలయం మొదట్లో చిన్నగానే వుండేది. స్వామి శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు కుంభకోణంలో జరిగే మహామఖి ఉత్సవానికి వెళ్తూ, దోవలో ఈ ఆలయాన్ని దర్శించారు. ఆయన ఈ ఆలయాన్ని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంగా మార్చి, 12 ఎకరాల స్ధలంలో పంచ ప్రాకారాలు, సప్తద్వారాలతో, అత్యంత కళాత్మక శిలా నైపుణ్యంతో అందమైన దేవాలయంగా పునర్నిర్మించటానికి భూదానాలు చేశాడు. ఈ విషయం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ ఉత్తర గోపుర ద్వార కుడ్యముపై వున్న శాసనం ద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలోనే హరికంఠాపురం అనే ఆ ఊరి పేరును తన తల్లి పేరున నాగమాంబాపురంగా మార్చినట్లు తెలుస్తున్నది. రాను రాను నాగమాంబాపురం కాస్తా నాగలాపురంగా మారింది.
ఉపాలయాలుఆలయంలోనూ, ఉపాలయాలలోనూ విష్ణు దుర్గ, బ్రహ్మ, లక్ష్మీ భూవరాహస్వామి, విష్వక్సేనుడు, వేణు గోపాలస్వామి, లక్ష్మీనారాయణ, హయగ్రీవుడు, వీరాంజనేయస్వామి, సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడు వగైరా దేవతా మూర్తులను దర్శించకోవచ్చు.
ఆలయంలో ప్రవేశించగానే ఎడమవైపు నాగరాజ గణేశుడు నుంచుని దర్శనమిస్తాడు. ఈయన ఎడమ చేతిలో నాగరాజు కర్ర లాగా వుంటాడు. అందుకే ఆయనకా పేరు. పైగా ఈయనకి శ్రీ వెంకటేశ్వరస్వామికి మాదిరి తిరునామాలు వుంటాయి.
ఇక్కడ రెండు విష్ణు దుర్గ విగ్రహాలు వున్నాయి, శంఖం, చక్రంతో. ఒకటి చిన్న విగ్రహం, ఇంకొకటి కొంచెం పెద్దది.
గర్భ గుడిలో స్వామి విగ్రహం దాదాపు ఆరు అడుగుల ఎత్తున, నడుము కింద మత్స్య రూపం, పైన శ్రీ మహావిష్ణు రూపంతో, ఇరువైపుల శ్రీదేవి, భూదేవులతో, అల్లంత దూరంనుంచే అత్యద్భుతంగా దర్శనమిస్తారు.
ముఖ్య విశేషంఈ ఆలయంలో ప్రధాన రాజగోపురంనుంచి 630 అడుగుల దూరంలో వున్న స్వామి మూల విరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా మూడు రోజులపాటు ప్రసరిస్తాయి. ఇవి మొదటి రోజున స్వామి పాదముల మీద, రెండవ రోజు నాభి మీద, మూడవ రోజు స్వామి శిరస్సు మీద ప్రసరింపబడి స్వామి దివ్య రూపాన్ని తేజోవంతం చేస్తాయి.
మత్స్యావతార రూపంలో శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో చాలా సంవత్సరాలు యుద్ధం చేసి వచ్చినందున నీటి అడుగున వున్న ఆయన దివ్య శరీరము వెచ్చదము కొరకు సూర్యభగవానుడు తన కిరణాలను స్వామిమీద ప్రసరింపచేశాడు. అందువల్లనే నేటికీ సూర్యుని కిరణాలు స్వామిని తాకే రోజులలో సూర్యపూజోత్సవాలుగా కొనియాడబడుతూ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
మనశ్శాంతి, నవగ్రహశాంతి, వివాహ, సంతాన, సౌభాగ్యాలకోసం కుటుంబ సమేతంగా దర్శించుకోవాల్సిన పుణ్య క్షేత్రంగా భక్తులచే కొనియాడబడుతున్నదీ స్వయంభూ మత్స్యావతార శ్రీ వేదనారాయణస్వామి క్షేత్రం.
మార్చినెల 23, 24, 25 తేదీలలో సూర్య కిరణాలు స్వామిమీద ప్రసారమవుతాయి. ఆ సందర్భంలో జరిగే సూర్య పూజ ఉత్సవాలకు అనేక ప్రాంతాలనుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఏప్రిల్ లో 10 రోజులపాటు స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
24-9-1967నుంచి తిరుమల తిరుపతి దేవస్ధానంలో చేర్చబడి, సకల ఉత్సవాలు వైభవంగా నిర్వహింపబడుతున్నాయి.
మార్గముచిత్తూరు జిల్లాలో వున్న ఈ ఆలయం తిరుపతి – మద్రాసు రహదారిలో (వయా ఊత్తుకోట) తిరుపతికి 68 కి.మీ. ల దూరంలోను, మద్రాసుకు 73 కి.మీ. దూరంలో వున్నది. తిరుపతినుండి రోజూ ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారి ఆలయ దర్శన బస్సులు వుంటాయి.